26, జులై 2010, సోమవారం

ఎన్నేళ్ళకు?...మా విజయవాడలో?...



మా ఊరు విజయవాడ. అసలయితే మాది కోనసీమ.అమలాపురం దగ్గర ముంగండ అగ్రహారం.కానీ మా నాన్న ఉద్యోగరీత్యా విజయవాడకు వచ్చామన్న మాట. మా చిన్నతనంలో గాంధీనగరలో ఉండేవారం.మూడంతస్తుల మేడలో కింద మూడుగదుల పోర్షన్లో ఉండేవారం. పక్క పోర్షన్ల వారి పిల్లలు, ...సరదాగా ఉండేది. క్రమేణా వారిలో చాలా మంది ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు.మేము కూడా ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయాం. అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం. కొన్నాళ్ళకు అదీ తగ్గింది.పెళ్లిళ్లకు ,ఇతర శుభకార్యాలకు కలిసేవాళ్ళం.అయితే ఆ రోజులు మేము మరచిపోలేదు.మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ లో స్థిరపడింది. విజయవాడలో ఇల్లు షాప్స్ చేసాం.ఒక పోర్షన్ మాత్రం ఉంది.ఈ మధ్య నాకు,మా అక్కకి విజయవాడ వెళ్ళే ఛాన్స్ దొరికింది.మా తమ్ముడు కూడా వచ్చాడు. చిన్నతనంలో బాబాయ్ హోటల్ కొంచెం తెలుసు.హైదరాబాద్ లో చట్నీస్ హోటల్ లో బాబాయ్ ఇడ్లి తిన్నాక తప్పకుండా విజయవాడ వెళ్లి తినాలనుకున్నా.అందుకే వెళ్ళగానే బాబాయ్ హోటల్ కి పరుగెత్తా. ఇడ్లీ తిన్నా. gఒప్పగా అనిపించలేదు. ఫోటోలు తీసా.మరి అందరికీ చూపాలికదా. అక్కడినుంచి నేను,మా నాన్న,కుమార్ (తమ్ముడు),బన్ను (అక్క కొడుకు), టిన్ (మా అబ్బాయి) మా పాత ఇంటికి వెళ్ళాం. ఇప్పటికీ ఆ ఇల్లు అలాగే ఉంది.గేటు కూడా.చిన్నప్పుడు ఆ గేటు దగ్గర ఫోటో దిగాం. అందుకని మరోసారి ఫోటో దిగాం.ఆ మర్నాడు చిన్నప్పుడు మా పక్కన ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అలా మూడురోజులు చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నాం. ఎంత సంతోషం అనిపించిందో?నా ఫ్రెండ్స్ అందరినీ కలిసాను. ఇంక కొందరిని కలవలేక పోయాను. ఈసారి ప్రయత్నిస్తాను.ఇంతకీ నేను చెప్పేదేమిటంటే, యాంత్రిక జీవితంలో నేను, నా జీవితం అనుకోకుండా అప్పుడప్పుడు ఇలా చిన్నప్పటి నేస్తాలను కలుసుకుంటే, నువ్వు-నేను-మనం అనుకోవచ్చు కదా !

19, జులై 2010, సోమవారం

ఎవరికోసం?

హాయ్, హలో ,గుడ్ మార్నింగ్! కాని ఇవాళ చాల కోపంగా,బాధగా ఉంది.అసలు పిల్లలకు చదువులు వస్తాయా అని బెంగగా ఉంది.లేకపోతె ఏమిటి?ఎక్కడో బాబ్లిపైన గొడవ అయితే ఇక్కడ స్కూల్స్ మూసేస్తే , ఏమొస్తుంది? ఇంగితం అనేది రాను రాను తగ్గిపోతోంది.మా ఫ్రెండ్ చెప్పింది చాలా మంది వాళ్ళ పిల్లల్ని వేరే రాష్ట్రాల్లో చేర్పిస్తున్నారట చదువుల కోసం.అంతేకాదు.ఆందోళనలు చేసేవాళ్ళ పిల్లలు హాయిగా వేరే ఊళ్లలో చదువుకుంటున్నారట. పాపం,ఏ పాపం ఎరుగని అమాయక జీవుల పిల్లలు,పెద్దలు ఈ బంధుల మూలంగా నష్టపోతున్నారు.మొన్నటికి మొన్న పరీక్షలలో ఎన్ని శలవులు?దానివల్ల ఎందరో నష్టపోయారు.ఇవన్ని చూసి మా అక్క కొడుకుని చెన్నై లో చేర్పించారు.మొత్తమ్మీద పక్కవాడు బాగు పడుతున్నాడు.మన రాష్ట్రం నష్టపోతోంది. అసలు ఈ రాజకీయ వాదులను ఎక్కడన్నా వదిలేయాలి.లేకపోతె, వెళ్లి మహారాష్ట్రలో బందు చేయడమో, నిరాహారదీక్ష లాంటివి చేయాలిగాని ఇక్కడ ఏమి చేస్తే మాత్రం ఏం లాభం?కేవలం,కుటిల రాజకీయాలతో, ప్రచారం కోసం చేసే గిమ్మిక్కులతో ఇబ్బందుల పాలయ్యేది సామాన్య ప్రజలే.

13, జులై 2010, మంగళవారం

దేవుడా!కాపాడు

హాయ్ , గుడ్ మార్నింగ్ !ఈ రోజు ఏం చేస్తున్నారు? మరేమీ లేదు. సాధారణంగా వేసుకునే ప్రశ్నే ఇది.ఒక్కోరోజు ఏం చేయాలో అర్ధంకాదు. మాములుగా రోజు చేసే పనులు చేయబుద్ధి కాదు.మూడ్ కొంచెం చికాకుగా ఉంటుంది.అలా ఎలా ఉంటుంది కారణం లేకుండా అనద్దు .రాత్రి చాలా సేపు నిద్ర పట్టలేదు.మన ప్రమేయం లేకుండా ఎవరైనా మనల్ని నిందిస్తే ఎలా ఉంటుంది?అలా నేను కూడా ఒకరి కారణంగా బాధ పడాల్సి వచ్చింది. నువ్వు, నేను, మనం అనుకుంటూ , అంతా మనవారే అని మరీ ఫీల్ అయితే ఇలాగే ఉంటుందేమో . అసలు నాకు అర్ధం కాని విషయం చదువుకున్నవారు, మంచి, చెడు తెలిసిన వాళ్ళు కూడా మూడో వ్యక్తీ మాటలు ఎలా నమ్ముతారు?ఇది నా ఒక్క అనుభవమే కాదు. నా ఫ్రెండ్స్ అనుభవం కూడా.అదృష్టం కొద్ది నా ఫ్రెండ్స్ , నేను ఏమి అనుకోము. మా స్వభావాలు తెలుసు.ఉద్యోగంలో ఉన్నపుడూ దాదాపు అంతా బాగానే ఉండేవారు.ఇప్పుడు ఇంటిదగ్గర చాలా మంది నా దగ్గరికి సలహా కోసం వస్తూ ఉంటారు.ఏదో నాకు తోచినది చెప్తాను.ఒక్కోసారి వీళ్ళు ఇతరుల మాటలు నమ్మి అపార్ధం చేసుకుంటారు. అప్పుడూ నేను సర్దిచెప్పడానికే ప్రయత్నిస్తాను.నేను ఎవరినీ సలహా కోసం రమ్మని అడగను.ఏదో బాధ పడుతున్నారు కదా అని మాట్లాడితే ఇదే సమస్య.ఆ విధంగా నిన్న నాకు బాధ కలిగిందన్న మాట. పైగా అంతా నువ్వు కౌన్సిలరువి కదా, అంటారు. అంటే , నాకు బాధ ఉండదా ? ఏమిటో ?ఏదో అందరం బాగుండాలి అని నా తాపత్రయం.చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటే ఎలా? ఒకచోట ఉంటున్నపుడు కలసి మెలసి ఉండాలి అని , ఎవరి గురించి చెడుగా అనుకోకూడదని ఎలా చెప్పాలి? ఈ ఆలోచనలతో రాత్రి సరిగా నిద్ర పోలేదు. రోడ్డు మీదకు వచ్చేసరికి ఏవో ద్రయినేజి గొట్టాలు పెట్టడం కోసం తవ్వేసారు.రోడ్డు వేసాక తవ్వేబదులు ముందే ఆ పని చెయ్యచ్చు కదా !ఈ వెంకటరమణ కాలనీ ఎప్పుడు బాగు పడుతుందో ఆ ఏడుకొండల వెంకట రమణ కే తెలియాలి.జనాలకు పౌర స్పృహ, ఇరుగు- పొరుగుతో బాగుండాలి, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు అనే ఆలోచనలు ఎప్పుడు వస్తాయో?దేవుడా,కాపాడు.

12, జులై 2010, సోమవారం

టాయ్ స్టోరీ

హాయ్ మిత్రులారా,అంతా క్షేమమా! గత మూఢు రోజులుగా మా అబ్బాయి షటిల్ టోర్నమెంట్ వల్ల ఏమీ రాయలేదు.జిల్లా స్థాయి పోటీలు.పాపం,క్వార్టెర్ ఫైనల్స్ల్ లో ఓడిపోయాడు.ఓదార్చి టాయ్ స్టోరీ సినిమాకి తీసుకువెళ్ళాను.చాలా బాగుంది. బొమ్మలకూ మనసు ఉంటుందని హ్రుద్యంగా చూపారు. చివరలో కాలేజికి వెళ్ళె అబ్బాయి బొమ్మలను చిన్న పిల్లకు ఇవ్వడం మా టిన్నుకి నచలెదు. తను అలా ఇవ్వడట.తన పిల్లలే ఆడుకొవాలట. మా అబ్బయి దగ్గర చాలా బొమ్మలు ఉన్నయి.స్పైడర్మాన్,సూపర్మాన్, బాట్మాన్,హనుమాన్ ... ఇలా అద్భుత శక్తులు ఉండే వాళ్ళంతా మా వాడికి ఇష్టం. ఒక్కో రకం నాలుగైదు ఉంటాయి. నాకు కూడా బొమ్మలంటే ఇష్టమే. అందుకే కొంటూ ఉంటాం. ఇవాళ లెఖినిలొ చేస్తున్నా. అందుకే అంత త్వరగా రావడం లేదు. రేపు ఎక్కువ మాట్లాడతానే. ఇవాల్టికి బై.

7, జులై 2010, బుధవారం

నాకు తెలిసిన మహా నేత

ఫ్రెండ్స్, ఇవాళ దివంగత రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు.ఈ సందర్భంగా నేను నాకు ఆయనతో ఉన్న అనుబంధం మీతో చెప్పాలనుకుంటున్నాను.నిజానికి నాకు ఆయనతో పెద్ద పరిచయం ఏమి లేదు.నా కాలేజ్ రోజుల్లో ఆయన గురించి మొదటిసారి విన్న.అదీ పేపర్ లో.ఎందుకో తెలీదు. ఆయనలో ఒక ఠీవి,రాజసం నాకు కనిపించాయి.చాలా ఏళ్ళు అలాపేపర్లో చదవడమే గానీ పరిచయం లేదు.ఈనాడు పేపర్లో పనిచేస్తున్నపుడు నా భర్త ఒక టీవీ చానెల్ లో రిపోర్టర్ గా పనిచేసేవారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు. ఆ క్రమంలో నా భర్తకు ఆయనతో పరిచయం కొంత పెరిగింది.నాకు పరోక్షంగా అభిమానం పెరిగింది.ఎందుకు అంటే చెప్పలేను కానీ కొందరిని చూస్తె అభిమానం కలుగుతుంది అంతే. ఈనాడు వసుంధర పేజి లో ప్రముఖుల భార్యల ఇంటర్వ్యూ ఇచ్చేవారం. మా ఎండీ గారు రాజశేఖర్రెడ్డి గారి భార్య ఇంటర్వ్యూ చేయమన్నారు.అప్పటికే నాకు ఆసక్తి ఉండటంతో నేను ప్రయత్నం చేస్తానన్నాను.నా భర్త ద్వారా సులభంగానే ఇంటర్వ్యూ దొరికింది. రాజశేఖర రెడ్డి గారు, వారి భార్య విజయలక్ష్మి గారు ఎంత బాగా మాట్లాడారంటే, ఇప్పటికీ (సుమారు పదేళ్ళు అయింది) ప్రతిమాటా గుర్తే. మా అబ్బాయిని కూడా దగ్గరికి తీసుకున్నారు. వసుంధరలో వచ్చిన ఆ ఇంటర్వ్యూ నాకు మంచి పేరు తెచ్చింది. అప్పటి నుంచి ఇంకా అభిమానం.ఆయనను ఎవరన్నా విమర్శిస్తే సమాధానం చెప్పేదాన్ని.ఇంటర్వ్యూ లో ఆయన భార్య కోరుకున్నట్టే తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నిక్కచ్చితనం కొంత భయంగా ఉన్నా, అన్నిటా విజయం సాధించాలని కోరుకునేదాన్ని.ఆయనతో చాలా దగ్గరగా ఉన్న నా భర్త ద్వారా నేను మరింత అభిమానం పెంచుకున్నాను. మా ఇంటికి వస్తానని రాకుండానే అనంతలోకాలకు వెళ్లిపోతారని ఊహించలేదు. ఆయన మరణించి సంవత్సరం అవుతున్నా,సమస్యలతో రాష్ట్రం అల్లాడుతోంది . ఇంకా ఎక్కడో ఆశ . ఏదో ఒక రోజు అలా నడచుకుంటూ వస్తారేమో అని. చెప్పేది చేసేవారు కొందరైతే , చెప్పనిదీ చేయడం, స్నేహానికి విలువ ఇవ్వడం, కుటుంబానికి తగినంత సమయం కేటాయించడం ,నమ్మినవారిని ఆదుకోవడం ఆయన నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.నాయకుడు ఎలా ఉండాలో చూపిన వ్యక్తి .చాలా మంది ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలు అని, రకరకాలుగా అంటారు గానీ, అవన్నీ తప్పే.సన్నిహితంగా చూసిన వారెవరూ ఆయనపై అటువంటివి అనరు.తన లోపాలను కూడా చెప్పేవారు. అటువంటి నాయకులు ఇకముందు ఉండరేమో.అందుకే ఎప్పటికీ నా అభిమాన నాయకుడు డా. రాజశేఖర రెడ్డి.

5, జులై 2010, సోమవారం

ఉద్యోగం ఎందుకు మానేసాను?

నేను ఎప్ప్పుడూ అనుకోలేదు ఒక దినపత్రికలో పని చేస్తానని.సరదాగా ఈనాడు జర్నలిజం స్కూల్ కి అప్లై చేశా. సీటు వచ్చింది. ఆరునెలలు కోర్సు. ఎనిమిది వందలు ఇచ్చేవారు. హాస్టల్ లో ఉండేదాన్ని.చాలా సరదాగా ఉండేది. కాని విజయవాడ నుంచి వేరే ఊరు రావడం అదే మొదటిసారి. దాంతో కొంచెం బెంగగా ఉండేది.కాని తొందరగానే అలవాటు పడ్డాను.కోర్సు అవగానే విజయవాడ లో పోస్టింగ్ ఇస్తారనుకున్న. కాని హైదరాబాద్ ఆఫీసులోనే ఇచ్చారు. వసుంధర మహిళా పేజి లో పనిచేయాలన్నారు. మొదట్లో చాలా కొత్తగా ఉండేది. తర్వాత అలవాటు అయింది. హాస్టల్ లో చాలా విషయాలు నేర్చుకున్న.రకరకాల వ్యక్తులు,స్వభావాలు తెలిసాయి.ఆఫీసు లో కూడా అందరితో ఫ్రీగా మాట్లాడేదాన్ని. దాంతో కొన్ని చిన్న చిన్న అపార్ధాలు. సుమారు అయిదేళ్ళు గవర్నమెంట్ జాబు లా ఎంజాయ్ చేశా. తర్వాత షిఫ్ట్ మార్చారు.అన్నాళ్ళు అక్క వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని.రోజు రాత్రి ఎనిమిదింటికి బస్సు లు మారి, మెహదిపట్నం వెళ్లేసరికి తొమ్మిది దాటేది. స్పెషల్ వర్క్ ఉంటె ఇంక లేట్ అయ్యేది.మా బాస్ ఎమన్నా అంటే ఏడుపు వచ్చేది. అయితే పెళ్లి అయ్యాక ఆఫీసు పక్కనే ఇల్లు.హాయిగా ఉండేది. బాబు(టిన్) పుట్టాక కూడా బాగానే పని చేశా.తర్వాత రెండేళ్ళకి మా బాస్ ని మార్చారు. అప్పుడప్పుడే నాకు మంచి ఆర్టికల్స్ రాయడానికి అవకాసం వచింది. వచ్చింది.కాని ఈ కొత్త బాస్ చాల యాంత్రికం.మన బాధలు పట్టవు.అర్ధరాత్రి పన్నెండు అయినా అప్పుడే ఆఫీసుకి వచ్చినట్టు ప్రవర్తించేవాడు.ఒక చిన్న శీర్షికకి గంటలు, గంటలు వేస్ట్ చేసేవాడు. మనకేమో ఇంట్లో చిన్న పిల్లాడు.తెల్లవారుజాము వరకు అలాగే ఉండాల్సి వచ్చేది. మా సీనియర్ వీణ గారి దగ్గర నా అసహనం చూపెదాన్ని.పాపం, ఆవిడ నాకు సర్ది చెప్పేవారు.కొన్నాళ్ళకు నాకు వేరే డెస్క్ బదిలీ అయింది.అక్కడ బాస్ చాలా మంచి ఆయన. కానీ నాకే పని నచ్చలేదు. ఇంట్లో బాబు రోజు ఏడుపే ఆఫీసు మానెయ్యమని.అప్పటికే మా అమ్మ,నాన్న నా గురించి అయిదేళ్ళు మా అబ్బాయి కోసం ఉన్నారు. వాళ్ళు ఊరు వేల్తామన్నారు.ఈలోగా మా శ్రీవారికి బిజీ గ ఉండే ఉద్యోగం వచ్చింది.దాంతో తప్పనిసరి అయి ఉద్యోగానికి రాజీనామా చేశా.ఆ తర్వాత ఎక్కడా చేయలేదు. అదే నా మొదటి,చివరి ఉద్యోగం అయింది.ఇప్పుడు మా వాడు అంటూ ఉంటాడు కావాలంటే వెళ్ళు జాబు కి అని.వాడికి అవసరం తీరిపోయింది కదా ! అయిన ఇంకా అదే ఆఫీసులో చేస్తున్న మా ఫ్రెండ్స్ కష్టాలు చూస్తుంటే మానేసి మంచిపనే చేశా అనిపిస్తుంది.ఆఫీసు మానేసాక కొన్నాళ్ళు బాధగా ఉన్న కుటుంబానికి దగ్గరయ్యాను అనే తృప్తి మిగిలింది.అయినా ఖాళీగా లేకుండా ఫ్యామిలీ కౌన్సేల్లింగ్ కోర్సు చేశాను.ఇప్పుడు సొంతంగా సెంటర్ పెట్టుకున్న. aదన్న మాట నా ఉద్యోగం సంగతి.

1, జులై 2010, గురువారం

వానలో...గోదావరినుంచి హాంగ్ కాంగ్ వరకు...

ఎన్నాళ్ళకు వాన పడింది ? రోజు చాలా చికాకుగా ఉక్కగా ఉంటోంది. అప్పుడప్పుడు మబ్బులు కనబడటమే గానీ చుక్క కురవడం లేదు. నిన్న రోజంతా మబ్బులు ఊరించి చివరకు సాయంత్రం వానగా మురిపించాయి.అలాంటపుడు వేడిగా టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటే బలే ఉంటుందికదా!అనుకోకుండా నా ఫ్రెండ్ వానలో చిక్కుకుని ఇంటికొచ్చింది. ఆ విధంగా నా కోరిక తీరింది.చూసారా దేవుడు వానని, ఫ్రెండ్ ను కూడా రప్పించాడు.కాలేజీ లో ఉన్నపుడు బుక్స్ ఒకరికిచ్చి అందరం తడుస్తూ ఇంటికేల్లెవాళ్ళం. అమ్మ తిట్టినా సరే.అదో ఆనందం. ఇప్పుడు కూడా వర్షం వస్తే తడవాలనే ఉంటుందికాని కాలుష్యం తో కూడినది ఎందుకులే అని వదిలేస్తున్న.మా అబ్బాయికి అస్సలు వర్షం నచ్చదు. రోడ్లు మురికిగా ద్రయినేజిలన్ని నిండి ఉంటాయికదా ! అందుకే వాన వద్దు అంటాడు.అప్పుడు నేను వాన రాకపోతే ఎంతమంది ఎడుస్తారో వివరిస్త. సరేగాని మరీ ఎక్కువ రాకూడదు అంటాడు.సరే, మనం వాన గురించి కదా మాట్లాడుకుంటున్నాం.గీతాంజలి సినిమా లో జల్లంత కవ్వింత కావాలిలే పాట చాలా ఇష్టం. మణిరత్నం సినిమాల్లో వాన బాగుంటుంది.శేఖర్ కమ్ముల ఆనంద్లో కూడా.గోదావరిలో వాన పాట ....అబ్బో చెప్తే చాలానే ఉన్నాయి.గోదావరి చూసి పట్టుబట్టి పాపికొండలు వెళ్ళాం రాజమండ్రి నుంచి మా ఫ్యామిలీ అంత. దారిలో పేరంటాల పల్లి దగ్గర ఇంకో బోటు రావాలి. అది ముందే వచ్చి వెళ్ళిపోయింది.మేము భద్రాచలం వెళ్ళాలి.రాజమండ్రి నుంచి వచ్చిన బోటు అదేదో కల్లూరు అనే చోట దింపేసి వెళ్ళిపోయింది.అక్కడ అన్ని వెదురు కాటేజీలు ఉన్నాయి.అక్కడి ఒనర్ని అడిగితె చిన్న పడవ ఇచ్చారు.అది మరో పల్లెవరకే.మేము మొత్తం పదమూడు మంది ఉన్నాం.అక్కడ సెల్ సిగ్నల్ ఉండదు. అందరికి టెన్షన్.మధు (నా భర్త) మాములుగా చాలా కూల్ గా ఉంటాడు. కానీ తను కూడా టెన్షన్ పడ్డాడు.అప్పట్లో టీవిలో న్యూస్ చీఫ్ . ముందే తెలిసినవాళ్ళకి చెప్పాడు.వాళ్ళు అప్పటికే మాకోసం వెతుకుతున్నారు.మధు కష్టపడి ఎక్కడికో వెళ్లి ఫోన్ చేశాడువాళ్ళకి .అంతవరకూ మేము ఆ పల్లెలో స్కూల్ లో చీకటిలో కూర్చున్నాం.ఒక గుట్ట ఎక్కి ఆ పల్లె ఎలా చేరామో తలచుకుంటే ఇప్పుడు తమాషాగా అనిపిస్తుంది. మొత్తానికి ఆ విధంగా మా పాపికొండల ప్రయాణం సాగింది.అంతకు ముందు ఒకసారి నేను,మధు,టిన్ వెళ్ళాం.అప్పుడు పడవలో ఉన్నప్పుడు వర్షం వచ్చింది. టిన్ కి భయం వేసింది పడవ మునిగిపోతుమ్దేమో అని.కాని పడవలో వర్షం రావాలన్న నా కోరిక తీరింది.మొన్న మే చివరలో హాంగ్ కాంగ్ వెళ్ళాం. అక్కడ వర్షం.ముందు గొడుగు కొన్నాం. డిస్నీ ల్యాండ్ లో రైన్ కోట్ కొన్నాం.మకావ్ లో వానలోనే .కాని హాయిగా తిరిగాం.ఇవీ ఇవాల్టి నా వాన ముచ్చట్లు.మరి ఉండనా.