హాయ్, హలో, ఆదాబ్ ! చాలా రోజులయింది కదా అని కొంచెం దీర్ఘంగా పలుకరించా అంతే.ఇంతకీ విషయం లోకి వస్తే,నిన్న స్టూడియో-ఎన్ లో కాల్ సెంటర్స్ మీద ఒక స్టొరీ ఇచ్చారు.అందులో పాల్గొన్న ఒక సి.ఈ. ఓ. ముఖం మీదకి పడుతున్న జుట్టు,చిన్న గడ్డం తో ఈనాటి యువతకి అచ్చమైన ప్రతినిదిలా ఉన్నాడు. పబ్ కి వెళ్ళబోయి చర్చకి వచినట్టే ఉన్నాడు.అసలు దానిద్వారా ఏం చెప్పాలనుకున్నారో తెలియలేదు.సరే ఆ విషయం అలా ఉంచితే మా ఫ్రెండ్ మంచి ఎస్ ఎంఎస్ పంపింది.దాని ప్రకారం దేవుళ్ళు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగులే.అదెలాగంటే,...
బ్రహ్మ:సిస్టం ఇన్ స్టాలర్
విష్ణు: సిస్టం సపోర్టర్
శివ: సిస్టం ప్రోగ్రామర్
నారదుడు:డేటా ట్రన్స్ఫెర్ (డేటా సరఫరా)
యముడు: డిలీటర(డేటా తొలగిమ్చేవాడు )
మేనక: వైరస్
బాగుంది కదూ !అంచేత ఈ సాఫ్ట్ వేర్ ఇప్పుడే ఉందని ఆయా ఉద్యోగులు సంబరపడనక్కరలేదు.
30, ఆగస్టు 2010, సోమవారం
25, ఆగస్టు 2010, బుధవారం
అనురాగ బంధం - రాఖీ
నిన్న రాఖీ పండుగ హడావుడిగా గడిచిపోయింది.మా తమ్ముడు (ఏకైక)వచ్చి నా చేత మూడు రాఖీలు కట్టించుకున్నాడు.ఒకటి నాది, రెండు మా అక్కలవి.ఎప్పుడూ అంతే. mఉగ్గురి తరఫునా నేనే కడతా. వాళ్ళు ఫోన్ చేసి ఆర్డర్ వేస్తారు.ఇంక విజయవాడలో నాకు దేవుడిచ్చిన అన్నలు కొందరు ఉన్నారు.చిన్నప్పటి నుంచీ అన్నయ్య లేడేఅనే బాధ కొంచెం ఉండేది.స్కూల్ లో ఉండగా వారితో పరిచయం.ఇప్పటికీ కొనసాగుతోంది.నిజంగా చాలా ప్రేమగా ఉంటారు.పొరపాటున రాఖి పంపడం ఆలస్యమయితే బాధపడతారు.అందుకే ఈ సారి ముందే పంపాను.నాకు ఎప్పుడూ వీలయినంత ఎక్కువమందికి కట్టడం అలవాటు.అలా అని అందరికీ కట్టను.వాళ్ళలో నాకు సోదరభావం కనిపించాలి.ఈ సారి విజయవాడ నుంచి మా అన్నలు బోకే పంపారు.మా టిన్ కి వాళ్ళ చెల్లి (మా మరిది కూతురు)ద్యుతి రాఖి పంపింది.ఉన్నంతకాలం సుఖసంతోషాలతో జీవించమని దీవించిన రాజకుమార్అన్నయ్య దీవెన చాలా సంతోషం కలిగించింది.స్కూల్ లో ఉన్నప్పుదయితే చాలా హడావుడి.పొద్దున్న వాళ్ళ ఇళ్ళకి వెళ్లి కట్టేదాన్నిమా తమ్ముడికీ ఇప్పటిదాకా ఎప్పుడూ కట్టకుండా లేను.వాడు వేరే ఊళ్ళో ఉన్నప్పుడు పోస్ట్ లో పంపేదాన్ని.వాడుకూడా చాలా ప్రేమగా ఉంటాడు.చిన్నప్పుడు మా నాన్న నన్ను కొడితే వాడు ఏడ్చేవాడు.(ఆ విషయం మీద చాల జోకులు ఉన్నాయి).నా లాగే అందరూ అనురాగాల రాఖి పండుగ బాగా చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను.
12, ఆగస్టు 2010, గురువారం
లక్ష్యం లేని జీవితం
చాలా మంది నీ లక్ష్యం ఏమిటి అని అడుగుతూ ఉంటారు.లక్ష్యం ఉంటేనే జీవితంలో బాగా ఎదగవచ్చనికూడా అంటూ ఉంటారు.నాకు ఏమి చెప్పాలో తోచదు.ఎందుకంటే నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు.ఉద్యోగంలో చేరేవరకు నాకు ఈ విషయం మీద ప్రత్యేకంగా ఒక అభిప్రాయం అంటూ లేదు.అసలు అదే కాదు.చదువు విషయంలోనూ అంతే. టెన్త్ వరకు తెలుగు మీడియం లో చదివా.తర్వాత ఏకంగా ఎం.పి.సి.గ్రూపు తీసుకొని ఇంగ్లీష్ మీడియం లో చేరా(టెన్త్ లో లెక్కల్లో మార్కులు తక్కువే ).మొదటి సంవత్సరం ఆడుతూ,పాడుతూ గడిపేసా.రెండో ఏడు బాగానే చదివా.ఫస్ట్ క్లాసు వచ్చింది .అబ్బో, ఇంకేముంది అని ఎంసెట్ రాసా.పది,పదకొండు,పన్నెండు మార్కులు వచ్చాయి. (ఇప్పటికీ మా ఇంట్లో వెక్కిరిస్తారు) పోనీ అనుకుని బీకాం లో చేరా.చాలా తేలిగ్గా చదివేదాన్ని.అలా పాసవుతూ థర్డ్ ఇయర్ లో స్టాటిస్టిక్స్ లో తప్పా. నిజంగా షాక్.మిగిలినవన్నీ తొంభైల పైనే వచ్చాయి.రెండు రోజులు ఏడ్చా .మళ్ళా రాసి పాసయినా ఇప్పటికీ ఆ బాధ అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత పబ్లిక్ రిలేషన్స్ లో డిప్లొమా చేశా. అప్పుడే ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రకటన చూసా.అసలు నాకన్నా మా అక్క కి జర్నలిస్ట్ కావాలని ఉండేది.అప్పట్లో కొన్ని ఇంటర్వ్యూలకీ వెళ్ళింది.బాడ్ లక్. రాలేదు.ఒకరకంగా మంచిదే.ఆ కుళ్ళు అంటకుండా బతికిపోయింది. నాకు ఈనాడులో సీటు వచ్చింది.అస్సలు ఇష్టం లేదు వెళ్ళడం.ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో వెళ్ళా.ఇంటర్వ్యూలో రామోజీ రావుగారు,బూదరాజు రాధాకృష్ణ వంటి ప్రముఖులు ఉన్నారు.(అప్పటికి నాకు వారి గురించి ఏమీ తెలిదు)నిర్భయంగా ఏదోదో మాట్లాడా. అదే వారికి నచ్చింది.సీటు వచింది.ఆరునెలలు హాస్టల్ లో ఉన్నా. జీవితంలో ఎప్పుడూ చదవనంతగా చదివా.ఇక్కడా చివరకు అన్యాయం జరిగింది.అన్ని పరీక్షలలో ముందున్న నేను ఫైనల్ లో బి గ్రేడుకు పడిపోయా.రాంక్ వస్తుందనుకుంటే అలా అయింది.రామోజీ చేతుల మీదుగా రాంక్ హోల్డర్ గా సర్టిఫికేట్ నందుకుంటాను అనుకుంటే అలా అయింది.గంట సేపు ఏడిచా.తర్వాత తెలిసింది కౌంటింగ్ లో పొరపాటు చేసారని.ఏమి లాభం?అప్పటికే నష్టం జరిగిపోయింది కదా ! పోనీ ,ఉద్యోగం అన్నా విజయవాడలో ఇస్తారేమో అనుకుంటే హైదరాబాదులో ఇచ్చారు.వసుంధర పేజీలో పన్నెండేళ్ళు పనిచేసా.మొదట్లో బాసుల నుంచి సహకారం ఉండేది కాదు.నాకేమో మొదటిసారి పని చేయడం.ఎక్కువ అవకాశాలు వచ్చేవి కావు.అదేమని అడిగితె ఇంకా చెత్త పని ఇచ్చేవారు.ఉత్తమ జర్నలిస్ట్ అవుదామనుకుంటే ఇలా ఉందేమిటి అనుకునేదాన్ని.సెలవు అడగాలంటే భయం.ఎం.బి.ఏ చేసి ఇక్కడినుంచి వెల్లిపోదాం అనుకుంటే ,అదీ పూర్తి కాలేదు.చాలా సార్లు నిర్మొహమాటంగా మాట్లాడే నా ధోరణి కూడా కొంత ఇబ్బందులు తెచ్చి పెట్టేది. అయితే ఏ బాధ అయినా ఆ క్షణమే ఉండేది.అదో సుఖం.మెల్లగా నా మారింది.కొంత తెలివితేటలూ అబ్బాయి. రామోజిగారి అబ్బాయి కిరణ్ పత్రిక బాధ్యతలు తీసుకున్నాక నాకు కొన్ని మంచి వార్తలు రాసే అవకాసం వచ్చింది.అందుకుగానూ ప్రసంసలూ దక్కాయి.వసుంధర పేజీ ద్వారా మహిళల సమస్యలు ఎన్నో తెలుసుకునే అవకాసం వచ్చింది.కొన్నాళ్ళకు నన్ను అక్కడినుంచి సిటీ పేజీకి వేసారు.అక్కడ నేను ఏం చేస్తాను?టీవీ ప్రోగ్రాములు ఇచ్చే పేజీ చూడాలి.ఇదీ ఒక పనేనా?మళ్ళా నిరాస.కానీ అక్కడి బాసు చాల మంచి వ్యక్తి. తగిన స్వేఛ్చ ఇచ్చారు. దాంతో తెగ రాసేదాన్ని.నేను మానేసిన సంవత్సరం దాకా ఆ కధనాలు వాడుకున్నారంటే ఎన్ని రాసి ఉంటానో ఊహించండి.సరే,అదీ విసుగ్గా అనిపించింది.కొన్నాళ్ళు సెలవు పెట్టా. స్కూటీ ఆక్సిడెంట్ అయి చెయ్యి విరిగింది.ఆ దెబ్బతో ఉద్యోగం మానేసా. వసుంధర ప్రభావంతో కొన్నాళ్ళు ఈటీవీ లో ప్రోగ్రామ్స్ చేశా.ఇంతలో నల్సార్ యూనివెర్సిటీ వారి ఫ్యామిలీ కోన్సేల్లింగ్ కోర్సు ప్రకటన చూసా.అప్లై చేశా.ఆరునెలల కోర్సు పూర్తీ అయ్యాక ఫ్యామిలీ కోర్ట్ కేసులు చూసేదాన్ని.రెండేళ్లకు ముప్ఫై శాతం జంటల్ని కలిపా.ఆ ధైర్యంతో సొంతంగా సెంటర్ పెట్టా.వందలకొద్దీ వస్తున్నారని చెప్పను.కానీ, వచ్చినవారు సంతోషంగా వెళ్ళేటపుడు తృప్తిగా ఉంటుంది.ఇప్పటికి అదే నా లక్ష్యం.మరి లక్ష్యం లేకపోవడం వలన నేను నష్టపోయానా? అంచేత నేను చెప్పేది ఏమిటంటే ఎప్పటికప్పుడు మన అవకాసాలను బట్టి ముందుకుసాగాలే కానీ,అనుకున్న లక్ష్యం సాధించలేదని ఆగిపోకూడదు.
4, ఆగస్టు 2010, బుధవారం
టాం అండ్ జెర్రీ ...తల్లీ బిడ్డా ...
ఈ మాట ఎవరైనా ఒప్పుకోవలసిందే .కావాలంటే పరిశీలించండి. టాం జెర్రీ వెనకాల ఎలా పరుగులు పెడుతుందో అచ్చంగా అలాగే ప్రతి తల్లీ తన పిల్లవాడి/పిల్ల వెంట పరుగెడుతూ ఉంటుంది.ఆనక చిన్ని క్రిష్ణుదనిమురిసిపోయి అందరికీ చెప్తూ ఉంటాం గానీ పరుగెత్తే టైములో వచ్చే విసుగు,చిరాకు అంతా ఇంతా కాదు.ఇది చూసి కాదు, స్వానుభవంతో చెప్తున్న మాట. మా టిన్ను ఉన్నాడే , వాడు అచ్చం జెర్రీ టైపు. వాడి కి ఇష్టమైన పాత్ర కూడా.ఇక నేను,వాడు ఆ రెంటితో పోటీ పడుతూ ఉంటాం. ఇప్పుడు మా వాడికి పదేళ్ళు.అయినా అదే అల్లరి.పొద్దున్నే వాడిని లేపటంతో మా షో స్టార్ట్ అవుతుంది.పళ్ళు తోముకో, పాలు తాగు ... అంటూ వెంట పడతా.వాడు నిద్ర వస్తోంది అంటూ ఉంటాడు.అది అయ్యాక స్నానం.రెడీ అవడం.వాళ్ళ నాన్న వి ఆ పనులు.అంచేత త్వరగానే అయిపోతాయి.ఈ లోపు నేను వంటింట్లో కుస్తీ పడివాడి కోసం మంచి టిఫిన్ రెడీ చేస్తా.తినమని వెంట పడతా.ఆకలి లేదు అంటాడు. పండు తినమంటా.అబ్బే,కుదరదు అంటాడు. ఇంతలో ఆటో వచ్చేస్తుంది. వెక్కిరిస్తూ వెళ్ళిపోతాడు.అలసిపోయి సోఫాలో కూలబడతా
స్కూల్కి రోజూ వెళ్తాడుకానీ, సెలవు వస్తే బాగుండని రోజూ కోరుకుంటాడు.ఇక వాడికి ఏవన్నా బొమ్మలు కావాలంటే,మా వెనకాలే తిరిగి జెర్రీ లాగే తను అనుకున్నవి సాధిస్తాడు. వాడు చెప్పేవి వినాలిగానీ మనం సలహా ఇవ్వకూడదు.అడిగితేనే ఇవ్వాలి.వాడు ఎవరిని తిట్టినా ఊరుకోవాలి.చదువుకోమని చెప్పకూడదు.చదువు అనగానే అంతవరకు హుషారుగా కబుర్లు చెప్పేవాడు కాస్తా దిగాలుగా అయిపోతాడు.నన్ను శత్రువులా చూస్తాడు.ఎలాగో రాజీ పడి మళ్ళా ఫ్రెండ్స్ అవుతాం.రాత్రి అన్నం తినమంటే పరుగు మొదలు.ఏవేవో కారణాలు చెప్తాడు.అసలు అన్నం దగ్గర,చదువు దగ్గర మా వాడు ఎప్పటికైనా అయిదు నిమిషాలైనా కూర్చుంటాడా అని డౌట్.చిన్నప్పుడు మా అమ్మ కధలు చెప్తూ అన్నం పెట్టేది.ఇప్పుడు వాడు కధలు చెప్తూ తినడం మానేస్తున్నాడు.చదువు దగ్గరకూడా వాడిని కూర్చోబెట్టడం మహా కష్టం. ఒక నిమిషానికే అన్నీ వచ్చేసాయంటాడు.అదే ఆడుకోమనిచెప్పామా ఇక అసలు పట్టుకోలెం. కానీ ఏ మాట కా మాటే.మా టిన్ను షటిల్ చాలా బాగా ఆడతాడు.ఈ మధ్య మొదటిసారిగా హైదరాబాద్ జిల్లా స్థాయి పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చాడు. స్కూలులో సరేసరి. అన్ని ఆటల్లో ఉంటాడు.కిందటిసారి 'బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ అఫ్ ది ఇయర్ ' అవార్డ్ స్కూలులో అందుకున్నాడు.పాటలూ బాగా పాడతాడు.కానీ, వాళ్ళ స్కూలు వాళ్ళు ఈ సారి అంత ప్రోత్సాహం ఇవ్వడం లేదు. అన్ని ప్రైజులు వచ్చినా స్కూల్ మ్యాగాజీన్లో వాడి ఫోటో అయినా వెయ్యలేదు.పైగా కొందరు టీచర్లు ఊరికే కొడుతున్నారు.చిన్నపిల్లల్ని ఎందుకలా కొట్టడం చెప్పండి.వింటున్న నాకే ఇంత బాధగా ఉంటే, పిల్లలకు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఎంతగా నేను,టిన్ను టాం అండ్ జెర్రీ లా ఉన్నా నేను, మధు ఇప్పటిదాకా వాడిని ఒక్కదెబ్బ కూడా వెయ్యలేదు.మరీ కోపం వస్తే తిడతా. అంతే.
3, ఆగస్టు 2010, మంగళవారం
ఇంకా బాల్యమేకదా !
ఈ రోజు ఉదయం ఎఫ్.ఎం రేడియోలో బాల్యంలో జరిగిన సంఘటనలపై మాట్లాడమని శ్రోతలకు టాపిక్ ఇచ్చారు.నాకు పొద్దున్నే మా టిన్నుకి టిఫిన్ తయారుచేస్తూ రేడియో వినడం అలవాటు.వాడు 8కి వెళ్ళాక కూడా వింటూ ఉంటాను.నాకూ నా బాల్యం గుర్తు వచ్చి మధుతో ఇలా అన్నాను.'బాల్యం బాగుంటుంది నిజమే కానీ, ఆ విషయం పెద్దయ్యాకే కదా తెలిసేదీ " .వెంటనే మధు 'అదేమిటీ!నువ్వు బాల్యంలోనే కదా ఉన్నావు ' అన్నాడు ఆశ్చర్యంగా,ఒకింత అమాయకంగా ముఖం పెట్టి. నవ్వేసా. కాసేపు అయ్యాక నీ చిన్నప్పటి గుర్తున్న జోక్ ఏమిటి? అని అడిగా(నాకు బుధ్ధి లేక)చాలా ఆసక్తిగా. తను కూడా అంతే సీరియస్ గా ముఖం పెట్టి 'బాల్యంలోనే వౄధ్ధాప్యం రావడం' అన్నాడు.పావుగంట సేపు కళ్ళళ్ళో నీళ్ళు వచ్చేలా నవ్వుతూనే ఉన్నా.అలా వ్యంగ్యంగా జోకులు వేయడంలో మా వాడు భలే దిట్ట.ఎవరికీ తెలియదుకానీ ఇక్కడ కొంచెం విషాదమూ ఉంది.చిన్నతనంలోనే మీదపడ్డ బరువుబాధ్యతలు గుర్తు వచ్చి కూదా అలా అన్నాడని నాకు అర్ధమైంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)