1, జులై 2014, మంగళవారం

ఎందుకలా మారిపోతాం?



నమందరం చిన్నతనంలో ఆడుతూ, పాడుతూ గడిపేస్తాం. అక్క, చెల్లి, తమ్ముడు ...అమ్మ,నాన్న..వీరే మన ప్రపంచం.మనలో మనకి ఎన్ని గొడవలున్నా మన అనే భావన ఉంటుంది.చదువులు,ఉద్యోగాల్లో పడ్డాక కొంత దూరం పెరిగినా, కలసినపుడు చిన్నపిల్లలు అయిపోతాం.కాని పెళ్లి అయేసరికి ఈ బంధాలలో చాలా మార్పు వస్తుంది.అన్నాళ్ళు చేయి పట్టి నడిపించిన నాన్న మాట నచ్చదు. అమ్మది చాదస్తం అనిపిస్తుంది.అసలు ఇన్నాళ్లుగా వీళ్ళతో ఎలా ఉన్నామా అని కూడా అనుకుంటాం.వాళ్ళపైన చిరాకు పడుతూ ఉంటాం. ఇక అన్నదమ్ములు,అక్కచేల్లెళ్ళలోఅసూయలు మామూలుగా ఉండవు.ఎవరో పరాయివారు, మనకి పడనివారు అన్నట్టు ఉంటాం.అందరూ అలాగే ఉంటారని కాదుగానీ , అనుభవంతో , చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి చెప్తున్నా మాట ఇది.పోనీ భార్యాభర్తలు అయినా అన్యోన్యంగా ఉంటారా అంటే అదే ఉంటే అందరితో గొడవలెందుకు వస్తాయి అనిపిస్తుంది. గొడవలు పడుతూ విడాకుల వరకూ వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు.చిత్రం ఏమిటంటే, వీరంతా మధ్యతరగతివారే. బాగా డబ్బు ఉన్న కుటుంబాల్లో ఆప్యాయతలు బాగా కనిపిస్తాయి.ఒకరికొకరు సాయం చేసుకోవడమూ ఎక్కువే. కావాలంటే పరిశీలించండి, ఆర్ధిక ఇబ్బందులు లేని కుటుంబాల్లో మానవ సంబంధాలు బాగుంటాయని అర్ధం అవుతుంది.అదే మధ్య తరగతికి వచేసరికి ఎక్కడో గాడి తప్పుతోంది.తమ్ముడు తన కన్నా ఉన్నత స్థాయిలో ఉంటే అన్న ఒర్వలేడు. అన్న బాగుంటే తమ్ముడు చూడలేదు.అమ్మానాన్నలు ఆడపిల్లలతో బాగుంటే అదో అభద్రతా భావం. అక్క చదువుకుంటే చెల్లెలికి అసూయ. చెల్లెల్ని ఎవరైనా మెచ్చుకుంటే అక్క ఏడుపు.అంతేనా, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నపుడు, వారిలో ఒకరికి పెళ్లి అయ్యాక , కాలం కలసి వచ్చి , డబ్బు వచ్చిందే అనుకుందాం. ఇక అదేదో తల్లిదండ్రుల తప్పు అయినట్లు వారిని నిందిస్తూ ఉంటారు కొందరు ఆడపిల్లలు.అంటే తమకు మంచి సంబంధం తేలేదని వారి భావన.అసలు ఏ తల్లిదండ్రులైనా అలా ఆలోచిస్తారా?తన అనే స్వార్ధం పెరిగిపోవడమే అన్నిటికి మూలకారణం.ఇది ఈ స్థాయికి చేరుతోందంటే, తన మూలాలనే నాశనం చేసుకునే తీరున సాగుతోంది. ఈ బాధలు చూసి కొంతమంది ఒక్కరే పిల్లలు చాలు అనుకుంటున్నారు.అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ....వారి పిల్లలు, అంతా కలుసుకోవడం, ఆనందాలు పంచుకోవడం తగ్గిపోయిందనే చెప్పాలి.ఒకపక్క సమాచార సాధనాలు ఎన్ని పెరిగినా, అవి మన హోదాకు, పరపతికి ఉపయోగిస్తున్నమే కాని, మనవారికోసం కాదు.ఇలా మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబందాలయితే , కుటుంబ వ్యవస్థకు పెను సవాలే.మరి ఏమిటి పరిష్కారం?చిన్నతనం నుంచి పెంపకంలో తిండి-తిప్పలతో పాటు మంచి, మర్యాద,సేవాభావం,పెద్దలను గౌరవించడం,ముఖ్యంగా మానవ సంబంధాలను పెంచుకోవడం నేర్పాలి.లేకపోతె పిల్లలు మాకు నేర్పినదే ఆచరిస్తున్నాం అనే ప్రమాదం ఉంది. మార్పు కాలానికి అనుగుణంగా సర్దుకుపోవడం నేర్పాలిగాని, ఇంట్లోంచి బయటకు పోయేలా కాదు.ఏమంటారు?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి