1, జులై 2014, మంగళవారం

ప్రేమ-పెళ్ళి-తిండి

ఒక అమ్మాయి,అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడటానికి ఎన్ని కారణాలు ఉంటాయో,ఆ తర్వాత వారిద్దరిమధ్య మనస్పర్ధలకూ అన్నే కారణాలు ఉంటాయి.ఇందుకు కారణం-అప్పుడు ప్రేమలో ఉంటారు-ఎదుటివారిలో లోపాలు,తప్పులు అంతగా బాధించవు. ఒకవేళ తెలిసినా తరవాత తమ ప్రేమతో మార్చుకోవచ్చనే నమ్మకం ఉంటుంది.లోపాలతో సహా స్వీకరించడమే అసలైన ప్రేమ అంటారుగానీ, ఆనక వచ్చే తప్పొప్పుల చిట్టా తేలుస్తుంది ప్రేమ ఏ స్థాయిలో ఉందో.కొందరు మిత్రులు ప్రేమవివాహాల్లో ఆహారపు అలవాట్ల సమస్యలు ప్రస్తావించారు.వీటిని ఎలా పరిష్కరించుకోవాలంటే,అది ఆయా వ్యక్తుల పరిణతి,కుటుంబ వాతావరణం బట్టి ఉంటుంది. ప్రేమలో ఉన్నప్పుడు ఇవన్నీ చిన్న విషయాలే.అప్పుడు చుట్టూ ఎవరూ ఉండరు.ఒకరిని మరొకరు మెప్పించాలని ప్రయత్నిస్తారు.అంచేత సమస్యలుండవు.పెళ్ళి అనుకోగానే పెద్దలు,సాంప్రదాయాలు,...ఇంకా చాలా విషయాలు ముందుకు వస్తాయి.పెద్దమనసుతో పెళ్ళికి తలూపారనే ఆనందంలో పెద్దవాళ్ళు చెప్పిన వాటికి సరే అంటారు.అక్కడినుంచీ ప్రేమకు పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. ఇవన్నీ వదిలేసినా,అసలు ప్రేమికుల్లో ఒకరు శాకాహారి(వెజిటేరియన్),మరొకరు మాంసాహారి(నాన్-వెజిటేరియన్) అయితె వారి మధ్య ఎటువంటి సమస్యలు రావచ్చో చూద్దాం. ఇందుకు నాకు తెలిసిన ఒక జంట గురించి చెప్తాను.
వాళ్ళిద్దరూ కాలేజీలో క్లాస్ మేట్స్.ముందు ఇష్టపడ్డారు.తర్వాత ప్రేమలో పడ్డారు.పెళ్ళికీ సిధ్ధపడ్డారు.అబ్బాయి అన్ని నాన్ వెజ్ వంటకాలూ తినే రకం. అమ్మాయేమో అమాయకంగా కనిపిస్తూ పప్పు,ఆవకాయ మాత్రమే తింటుంది. పొరపాటునకూడా మసాలా తినదు.వీరిద్దరూ పెళ్ళిచేసుకోవాలనుకున్నారు.వారి వారి ఇళ్ళలో చెప్పారు.అబ్బయి ఇంట్లో పెద్దగా అభ్యంతరం పెట్టలేదు.అమ్మాయి వాళ్ళ ఇంట్లో వద్దన్నారు.అమ్మాయికి అబ్బాయి వాళ్ళ అలవాట్లు భూతద్దంలో చూపించారు.అయినాసరే,'అతనే నా భర్తా' అందా అమ్మాయి.ఇంకేమిచేస్తం అనుకుని పెళ్ళి చేసారు.అమ్మాయి,అబ్బాయి కాపురం మొదలైంది.అంతకుముందే అమ్మాయి అతనిచేత మాంసం...వగైరాలు తినద్దని ఒట్టు వేయించుకుంది. అన్నాళ్ళూ ఏది పడితె అది కుషీగా తినే అతనికి ఆమె వండే వంటలు తినడం మొదట్లో సరదాగా ఉన్నా,రాను రాను ఇబ్బందిగా అనిపించడం మొదలైంది. అదీ కాక ఆమె వంటకాల గొప్పదనం చెప్పడం ఇంకా చిరాకు పుట్టించేది.ఏదన్నా హోటల్ కి వెళ్ళినపుదు తిందామా అంటె,ముఖం వికారంగా పెట్టేది.మెల్లగా ఆమెను,ఆమె వంటలను వెక్కిరించడం మొదలైంది.ఆమె కూడా అతని వంటలు,అలవాట్లు ఎత్తి పొడిచేది.ఎప్పుడైనా అత్తగారింటికి వెళ్ళినపుడు అక్కడ చికెన్ లాంటివి వండితే ఆమెకు ఒళ్ళు మండిపోయెది.దాంతో వెళ్ళడమూ మానేసింది.మెల్లగా కొన్నాళ్ళకు ఇద్దరూ రాజీ పడ్డారు.అతను ఒక్కడే బయటకు వెళితే తింటాడు.ఆమె కూడా పిల్లాడు పుట్టాక కొంచెం మారింది.ఇంట్లో కోడిగుడ్డు వండచ్చు.తనే ఆం లెట్ వెసేది. చూసారా మన అభిప్రాయాలు ఎలా మారిపోతాయో. కానీ,ఈ రోజుకూ ఆమె వెల్లుల్లి కూడా తినదు. అంటే,అభిరుచి మారలేదు.అభిప్రాయం మారింది అంతే.
మరో ఫ్రెండ్ మాంసాహారి. భర్త కూడా తింటారు. కానీ అత్త,మామ శాకాహారులు.వారు వస్తే కాయగూరలే వండాలి. వాళ్ళు ఉండే కొన్నిరోజులు చికెన్ తినక ఆమె ఎంత తిట్టుకునేదో,భర్తతో ఎంత గొడవ పడెదో. దాంతో ఆమెకు అత్తమామలపై కోపం.చివరకు వాళ్లని విడిగా పెట్టింది. అదీ ఆమె ఎంచుకున్న పరిష్కారం.ఈ సమస్యలు అందరికీ ఒకేలా ఉండవు.ఒకరితో మరొకరు సర్దుకుపొయే స్వభావాన్ని బట్టి ఉంటాయి. అయితే వీలయినంత వరకు మనవల్ల ఇబ్బంది లేకుండా చూసుకుంటే మంచిది.

-- పెళ్ళికి ముందే ఇష్టాలు-ముఖ్యంగా ఆహార విహారాల గురించి నిజాయితీగా చెప్పాలి.దీనివల్ల ఎంతవరకు ఒకరికొకరు సరిపోతారో(కంపాటిబిలిటీ) తెలుస్తుంది.

- పెళ్ళి అంటె కొంత సర్దుబాటూ అవసరమే.ఎంతసేపూ మనం కోరుకోవడమేకాదు.మననుంచి ఏం ఆశిస్తున్నారో కూడా గమనించాలి.వీలయినంత సహకరించాలి.

- వీలయినంతవరకు ముందే ఇరు కుటుంబాలవారితో మాట్లాడి, పరిస్థితులు అర్ధం అయ్యేలా వివరించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి