12, ఆగస్టు 2010, గురువారం

లక్ష్యం లేని జీవితం

చాలా మంది నీ లక్ష్యం ఏమిటి అని అడుగుతూ ఉంటారు.లక్ష్యం ఉంటేనే జీవితంలో బాగా ఎదగవచ్చనికూడా అంటూ ఉంటారు.నాకు ఏమి చెప్పాలో తోచదు.ఎందుకంటే నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు.ఉద్యోగంలో చేరేవరకు నాకు ఈ విషయం మీద ప్రత్యేకంగా ఒక అభిప్రాయం అంటూ లేదు.అసలు అదే కాదు.చదువు విషయంలోనూ అంతే. టెన్త్ వరకు తెలుగు మీడియం లో చదివా.తర్వాత ఏకంగా ఎం.పి.సి.గ్రూపు తీసుకొని ఇంగ్లీష్ మీడియం లో చేరా(టెన్త్ లో లెక్కల్లో మార్కులు తక్కువే ).మొదటి సంవత్సరం ఆడుతూ,పాడుతూ గడిపేసా.రెండో ఏడు బాగానే చదివా.ఫస్ట్ క్లాసు వచ్చింది .అబ్బో, ఇంకేముంది అని ఎంసెట్ రాసా.పది,పదకొండు,పన్నెండు మార్కులు వచ్చాయి. (ఇప్పటికీ మా ఇంట్లో వెక్కిరిస్తారు) పోనీ అనుకుని బీకాం లో చేరా.చాలా తేలిగ్గా చదివేదాన్ని.అలా పాసవుతూ థర్డ్ ఇయర్ లో స్టాటిస్టిక్స్ లో తప్పా. నిజంగా షాక్.మిగిలినవన్నీ తొంభైల పైనే వచ్చాయి.రెండు రోజులు ఏడ్చా .మళ్ళా రాసి పాసయినా ఇప్పటికీ ఆ బాధ అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత పబ్లిక్ రిలేషన్స్ లో డిప్లొమా చేశా. అప్పుడే ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రకటన చూసా.అసలు నాకన్నా మా అక్క కి జర్నలిస్ట్ కావాలని ఉండేది.అప్పట్లో కొన్ని ఇంటర్వ్యూలకీ వెళ్ళింది.బాడ్ లక్. రాలేదు.ఒకరకంగా మంచిదే.ఆ కుళ్ళు అంటకుండా బతికిపోయింది. నాకు ఈనాడులో సీటు వచ్చింది.అస్సలు ఇష్టం లేదు వెళ్ళడం.ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో వెళ్ళా.ఇంటర్వ్యూలో రామోజీ రావుగారు,బూదరాజు రాధాకృష్ణ వంటి ప్రముఖులు ఉన్నారు.(అప్పటికి నాకు వారి గురించి ఏమీ తెలిదు)నిర్భయంగా ఏదోదో మాట్లాడా. అదే వారికి నచ్చింది.సీటు వచింది.ఆరునెలలు హాస్టల్ లో ఉన్నా. జీవితంలో ఎప్పుడూ చదవనంతగా చదివా.ఇక్కడా చివరకు అన్యాయం జరిగింది.అన్ని పరీక్షలలో ముందున్న నేను ఫైనల్ లో బి గ్రేడుకు పడిపోయా.రాంక్ వస్తుందనుకుంటే అలా అయింది.రామోజీ చేతుల మీదుగా రాంక్ హోల్డర్ గా సర్టిఫికేట్ నందుకుంటాను అనుకుంటే అలా అయింది.గంట సేపు ఏడిచా.తర్వాత తెలిసింది కౌంటింగ్ లో పొరపాటు చేసారని.ఏమి లాభం?అప్పటికే నష్టం జరిగిపోయింది కదా ! పోనీ ,ఉద్యోగం అన్నా విజయవాడలో ఇస్తారేమో అనుకుంటే హైదరాబాదులో ఇచ్చారు.వసుంధర పేజీలో పన్నెండేళ్ళు పనిచేసా.మొదట్లో బాసుల నుంచి సహకారం ఉండేది కాదు.నాకేమో మొదటిసారి పని చేయడం.ఎక్కువ అవకాశాలు వచ్చేవి కావు.అదేమని అడిగితె ఇంకా చెత్త పని ఇచ్చేవారు.ఉత్తమ జర్నలిస్ట్ అవుదామనుకుంటే ఇలా ఉందేమిటి అనుకునేదాన్ని.సెలవు అడగాలంటే భయం.ఎం.బి.ఏ చేసి ఇక్కడినుంచి వెల్లిపోదాం అనుకుంటే ,అదీ పూర్తి కాలేదు.చాలా సార్లు నిర్మొహమాటంగా మాట్లాడే నా ధోరణి కూడా కొంత ఇబ్బందులు తెచ్చి పెట్టేది. అయితే ఏ బాధ అయినా ఆ క్షణమే ఉండేది.అదో సుఖం.మెల్లగా నా మారింది.కొంత తెలివితేటలూ అబ్బాయి. రామోజిగారి అబ్బాయి కిరణ్ పత్రిక బాధ్యతలు తీసుకున్నాక నాకు కొన్ని మంచి వార్తలు రాసే అవకాసం వచ్చింది.అందుకుగానూ ప్రసంసలూ దక్కాయి.వసుంధర పేజీ ద్వారా మహిళల సమస్యలు ఎన్నో తెలుసుకునే అవకాసం వచ్చింది.కొన్నాళ్ళకు నన్ను అక్కడినుంచి సిటీ పేజీకి వేసారు.అక్కడ నేను ఏం చేస్తాను?టీవీ ప్రోగ్రాములు ఇచ్చే పేజీ చూడాలి.ఇదీ ఒక పనేనా?మళ్ళా నిరాస.కానీ అక్కడి బాసు చాల మంచి వ్యక్తి. తగిన స్వేఛ్చ ఇచ్చారు. దాంతో తెగ రాసేదాన్ని.నేను మానేసిన సంవత్సరం దాకా ఆ కధనాలు వాడుకున్నారంటే ఎన్ని రాసి ఉంటానో ఊహించండి.సరే,అదీ విసుగ్గా అనిపించింది.కొన్నాళ్ళు సెలవు పెట్టా. స్కూటీ ఆక్సిడెంట్ అయి చెయ్యి విరిగింది.ఆ దెబ్బతో ఉద్యోగం మానేసా. వసుంధర ప్రభావంతో కొన్నాళ్ళు ఈటీవీ లో ప్రోగ్రామ్స్ చేశా.ఇంతలో నల్సార్ యూనివెర్సిటీ వారి ఫ్యామిలీ కోన్సేల్లింగ్ కోర్సు ప్రకటన చూసా.అప్లై చేశా.ఆరునెలల కోర్సు పూర్తీ అయ్యాక ఫ్యామిలీ కోర్ట్ కేసులు చూసేదాన్ని.రెండేళ్లకు ముప్ఫై శాతం జంటల్ని కలిపా.ఆ ధైర్యంతో సొంతంగా సెంటర్ పెట్టా.వందలకొద్దీ వస్తున్నారని చెప్పను.కానీ, వచ్చినవారు సంతోషంగా వెళ్ళేటపుడు తృప్తిగా ఉంటుంది.ఇప్పటికి అదే నా లక్ష్యం.మరి లక్ష్యం లేకపోవడం వలన నేను నష్టపోయానా? అంచేత నేను చెప్పేది ఏమిటంటే ఎప్పటికప్పుడు మన అవకాసాలను బట్టి ముందుకుసాగాలే కానీ,అనుకున్న లక్ష్యం సాధించలేదని ఆగిపోకూడదు.

2 కామెంట్‌లు:

  1. నిజ౦గా ఈపోస్టు బాగా నచ్చి౦ది. ముఖ్య౦గా, మనసుకి నచ్చిన పని చేసుకోవడ౦, EAMCET లో వచ్చిన మార్కుల దగ్గర ను౦చీ, పెద్దగా మొహమాట పడకు౦డా చెప్పడ౦... మీరు కవర్ చేసిన అ౦శాల ని టచ్ చేస్తూ రాయచ్చు కదా?

    రిప్లయితొలగించండి