1, జులై 2014, మంగళవారం

పిల్లల్ని ఎలా పెంచుతున్నాం?

ఇటీవలి కాలంలో పత్రికలలో , టీవీల్లో వచ్చే వార్తలు చూస్తే భయం వేస్తోంది. డ్రగ్స్ , ఇతర మత్తుమందుల వాడకం ఎక్కువైందని ,ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ రాకెట్లు పెరుగుతున్నాయని సమాచారం.ఏమైనా చెడు ఎక్కినంత త్వరగా మంచి ఎక్కదుకదా !మరి ఈ వాతావరణంలో మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి?కుటుంబ వాతావరణం,చక్కని సంబంధాలు,ప్రోత్సాహం ...ఇవన్నీ కొంతవరకు పిల్లలను దారి మళ్ళకుండా కాపాడుతాయి నిజమే.కానీ అంతకు మించి మనకు తెలియని ప్రలోభాలు బయట వాతావరణంలో కాచుకు ఉంటాయి కదా!డబ్బు యావలో పడి కుటుంబానికి తగినంత సమయం ఇవ్వక డబ్బుతో దాన్ని కొనుక్కో వచ్చనేవారు చాలా మందే తయారయ్యారు ఈ మధ్య. తండ్రులకు,తల్లులకు పార్టీలు, ఫంక్షన్లు ఎక్కువైతే పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఎలా తెలుస్తుంది?హైదరాబాద్ నగరంలో ఈ మధ్య పబ్బుల కల్చర్ బాగా పెరిగింది.కొన్ని పబ్బుల వద్ద ఏ టైములో చూసినా చిన్న పిల్లలు ,టీన్ ఏజ్ లో ఉన్న అమ్మాయిలు,అబ్బాయిలు చెట్టపట్టాలు వేసుకొని వెళ్ళడం కనిపిస్తుంది.అసలు వారి డ్రస్సింగ్ కూడా విచిత్రంగా గ్రహాంతర వాసుల మాదిరి ఉంటుంది.ఈ డబ్బున్న పిల్లల్ని చూసి వారి స్నేహమనే మాయలో ఇతర వర్గాల పిల్లలూ పడి చేతులారా తమకు తామే గోతులు తవ్వుకుంటున్నారు. ఎంతమంది అమాయక విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడటంలేదు ?పైకి ఎన్ని కారణాలు చెప్పినా ,అసలు కారణం ఇటువంటి ప్రలోభాలే.చాలా మంది కాలేజీ అమ్మాయిలకి,అబ్బాయిలకి స్నేహం ఒక ఫాషన్. ఇక ఇప్పటి వార్త మాధ్యమాలూ తక్కువ తినలేదు. నీతులు చెప్తూ బూతులు చూపిస్తున్నారు.ఇంటర్నెట్ ప్రలోభం మరోపక్క.అయితే ఇన్నిటి మధ్యా బాగా చదువుకొంటూ తమ లక్ష్యాల వైపు సాగిపోయే వారూ ఉన్నారు.వారి గురించి దిగులు లేదు.సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కూడా యువత పేద దారులు పట్టడానికి కారణమే.ఎక్కువ జీతం,వారానికి అయిదు రోజుల పని,మధ్యలో విదేశీ ప్రయాణాలు ...వీటితో మధ్యతరగతి యువత ఉక్కిరి బిక్కిరి అయింది.దాంతో లెక్కలేకుండా అయిపోయింది.వారాంతంలో క్లబ్బులు,పబ్బులు...అలవాటు అయ్యాయి.మొన్నటి మాంద్యం దెబ్బకి కొంతమంది నెల మీదికి వచ్చినా, ఇంకా చాలా మంది ఆ ఊబిలోనే ఉన్నారు.రాజకీయంగా,వ్యాపారపరంగా,హైదరాబాద్ అభివృద్ధి చెందడం మాట అటుంచితే,ఆయా వర్గాల పిల్లల అరాచకాలకు అంతులేదు. సినీ నటి ప్రత్యూష మొదలుకొని ఆయేషామీరా వరకు ఎందరు ఆడపిల్లలు ఈ విధంగా బలయ్యారో?అందుకే పిల్లల్ని ఒక కంట కనిపెట్టి ఉండండి. వారితో స్నేహం చేయండి.వారి స్నేహాలను గమనించండి.మంచి పౌరులుగా తీర్చిదిద్దండి.వారికి ఇవ్వాల్సింది కోట్లు కాదు. ఆత్మా విశ్వాసం,స్వీయ నియంత్రణ పెరిగే సలహాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి